Prathyaksha Daivamu Chapters Last Page
ॐ
దాతృ ప్రశంస
పరశురాముడు తపస్సు చేసికొన్న స్థలం కావడంతో 'పరశురామ క్షేత్రమ'ని పేరొంది కాలక్రమేణా పుంగ (శ్రేష్ఠమైన) పురి - 'పుంగనూరు'గా మార్పు చెందినది. ఇది చిత్తూరు జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో వుంది. చల్లని వాతావరణం గల ప్రదేశం. కన్నడ రత్నత్రయంలో రెండవ వాడైన 'పొన్నడు' ఈ పుంగనూరివాడే.
పూర్వమిది యొక జమీందారి. పేరుపొందిన సంస్థానము. ఈ యూరలేని దేవాలయములేదు. ఎక్కువగా ప్రాచీన చోళ సంప్రదాయములను పుణికి పుచ్చుకొన్న కట్టడము లిందున్నవి. ఇక్కడి కోనేరు అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీక. చక్కని సంప్రదాయానికి నిలయమైనది.
ఈ యూరిలో-కోటీశ్వరులు కాకపోయినా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి కీ|| శే|| టంకసాల వేంకటరాయ శేష్ఠిగారు. మాట నిలుకడ, నీతి నిజాయితీ, క్రమశిక్షణాయుతమైన జీవితం గడపిన పెద్దమనిషి. పరోపకార పరాయణులు. వీరి ధర్మపత్ని శ్రీమతి రుక్ష్మిణమ్మగారు. సాధుశీల, దైవభక్తి మెండుగా గలది. మహాత్ములనిన మక్కువ యెక్కువ. వీలు చిక్కినప్పుడల్లా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ, ఇంటి పనులు చేసుకుంటూ కూడా భక్తిగీతాలు పాడుతూ వుండేది. అనారోగ్యాన్ని కూడా లెక్కచెయ్యక దైవకార్యాలకు హాజరయ్యేది. పుంగనూరిలో శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయ నిర్మాణమునకై పరితపించినట్టిది. ఈ దంపతుల పుణ్యఫలముగా ఏతత్ గ్రంథ ముద్రణ ద్రవ్యదాత, ధార్మికమూర్తి శ్రీ టంకసాల సత్యనారాయణ గుప్తాగారు జన్మించారు.
చిన్నప్పటినుండి తండ్రివల్ల క్రమ జీవిత శిక్షణను పొంది, తల్లివలన భారత భాగవత రామాయణాది గాథలను విని ధార్మిక భావాలను అలవరచుకొన్నారు. వీరి ధర్మపత్ని శ్రీమతి వసుంధరమ్మగారు నిజముగా వసుంధర (భూదేవి) లాగా, అత్తగారిని ఆదర్శంగా చేసికొని 'సహ ధర్మచారిణి. అన్న పేరు సార్థకం గావించిన పుణ్య స్వరూపిణి' భగవద్గీతను ఆమూలాగ్రం పుక్కిటబట్టిన ఈమె తీరిక వేళల్లో పసిపిల్లలకు గీతాభ్యాసం చేయిస్తుంటారు.
కీ|| శే|| వేంకటరాయ శ్రేష్ఠిగారు ఈ యూరిలోని కాశీ విశ్వేశ్వరస్వామి గుడి అంటే చాలా యిష్టపడేవారు. 'దాన్ని రోజూ తప్పక చూడండి' అంటుండేవారు. మంచి పనులుగానీ, దైవ కార్యాలుగానీ తలచిన వెంటనే చేసెయ్యడం ఆయన అలవాటు. ఆ గుడి చుట్టూ బండలు పరచడం శిథిలాలను పునర్నిర్మించటం, శ్రీ వరసిద్ధి వినాయక స్వాములవారి గుడి రిపేరు - రెండు రూముల నిర్మాణము, పరశురాముల గుడి పునర్నిర్మాణములో కొంతభాగము, విరూపాక్షాలయ మరమ్మత్తులు - రెండు గదుల నిర్మాణము వీరి మూలంగానే జరిగాయి. వీరి పూర్వులు కీ|| శే|| టంకసాల చెంగల్‌రాయ శెట్టిగారు సోమేశ్వరాలయములో చిన్న దారికిగాను రాళ్ళు పరచివుంటే వీరు ఆవరణ అంతాపరచి దాన్ని పూర్తి చేశారు.
సుందరశిల్ప నిర్మాణము, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి కలశప్రతిష్ఠ, ఆ గుడిలో పింగాణిప్లేట్ల పని, ఇంకా ద్యాన మందిర నిర్మాణము, మాణిక్య వరదరాజస్వామి దేవాలయ మరమ్మత్తులు, కోదండరామస్వామి ఆలయములో కొంత భాగము, కన్యకాపరమేశ్వరీ ఆలయ నిర్మాణములో జైపూర్ నుండి అమ్మవారి అమృతశిలా విగ్రహమును తెప్పించడమూ మరియు నల్లరాతి విగ్రహము తెప్పించడము, శ్రీ చాముండేశ్వరీ గుడిలో నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము, ఉత్సవ మూర్తులు ఊరేగించడానికి ఒక కొయ్య రథాన్నివ్వడము-జంగాలపల్లి ఆంజనేయ దేవాలయములో పింగాణిప్లేట్లపని-స్వామికి వెండి శఠారము చేయించడము జరిగినది. ప్రక్కనున్న నేలపల్లిలోని గుడికి ఆంజనేయ విగ్రహం తెప్పించి యిచ్చారు. జ్యోతిర్లింగాశ్రమంలో పార్వతీదేవి గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. నిర్మాణాత్మకమైన పై కార్యక్రమాలలో శ్రీ ఎ. లోకరాజుగారు వీరి కెంతో తోడ్పడ్డారు.
అన్నదానం గొప్పది కాబట్టి పవిత్ర శ్రీశైల క్షేత్రంలోని మూడు సత్రాల్లోనూ సంవత్సరంలో ఒకరోజు భిక్షకు ఏర్పాట్లు చేశారు. మంత్రాలయం, పెనుగొండ, మాలూరు అనాథ శరణాలయాల్లో భిక్షకు విరాళ మిచ్చారు. పుంగనూరులో ప్రతి సం||రము ఉగాది రోజున అంగ వికలురకు నూతన వస్త్రాలివ్వడమే కాకుండా అన్న సంతర్పణ జరపడము- ఈ రకంగా ఏది చేసినా బయట చెప్పుకొని గొప్పగాపేరు తెచ్చుకోవాలని వీరికి లేదు. అది వీరి అభిమతానికి విరుద్ధమయిన విషయము.
శ్రీ వేంకటరాయశ్రేష్ఠిగారు చేసిన దానధర్మాదులకు 'చిట్టా' వ్రాయుట చేతకాని పని. చూచాయగా కొన్ని మాత్రమే తెలుపడమైనది.
'జ్ఞానదానం విశిష్యతే' అని గుర్తించి ఇక్కడి బసవరాజా కళాశాలలో ఉదారముగా ఒక తరగతి గదిని గూడా నిర్మించి యిచ్చారు. ఇంకను తిరువణ్ణామలై ఆంధ్రాశ్రమం, శ్రీరామకృష్ణాశ్రమం వంటివాటికి గూడా చాలా సహాయము చేసి వున్నారు. పోతే పేద కుటుంబాల కెన్నిటికో హోమియో మందులుకొని ఒక డాక్టరుగారి ద్వారా ప్రతి సంవత్సరము పంపిణీ చేసేవారు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినా వినయము మూర్తీభవించిన వ్యక్తి వీరు.
స్వామివారి పుంగనూరు రాక
1978-79 ప్రాంతాల్లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు పడమటి తీరానికి వెళ్ళేటప్పుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ పుంగనూరు పరిసరాల్లో వున్నప్పుడు ప్రముఖ డా|| సిద్దప్పగారితో పాటు శ్రీ సత్యనారాయణగారు (దాత) శ్రీ లోకరాజుగారు శ్రీ హరిజెట్టిగారు పురప్రముఖులు వెళ్ళి స్వామివారిని ఆహ్వానించారు. 'నడయాడే దేవుడై'న స్వామిపాదులవారి రాకకు ముందే వర్షం పడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
స్వామివారు బజారువీధిగుండా వస్తుంటే మంగళహారతి పట్టే భాగ్యం తమకు కల్గినట్లు వినయంగా చెప్పుకుంటూ వుంటారు శ్రీ సత్యనారాయణగారు. స్థానిక అఘోర వీర భద్రస్వామి గుడిలో విడిసిన శ్రీ స్వామిపాదులు సోమేశ్వరాలయంలో అమ్మవారి సన్నిధిలో శ్రీ కామాక్షీ త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరార్చనలుచేస్తూ 3 రోజులపాటు భక్తజనులకు అతిలోకమైన తమ దర్శనభాగ్యం కల్గించారు.
ఆ సందర్భములో ''ఒకరేమి చేశారో ఒకరేమి చెయ్యలేదో మన కనవసరం. శక్తికొలదీ సత్కార్యాలు చేసుకుంటూపోవడమే ఆత్మజ్ఞాన కారకమం''టూ స్వామివారు కావించిన ప్రవచనమే [చూ. పుట 81] తనకు మహోపదేశ##మై ఈ రచనను ముద్రింపించి, భక్తులకు బహూకరించుటకు ప్రేరేపించినదని శ్రీ సత్యనారాయణగారి సుదృఢ విశ్వాసము. అస్తు.
- పణతుల రామేశ్వర శర్మ.